Friday, February 13, 2009

కన్నయ్య

కనుల నిలచింది కన్నయ్య రూపు
మరపు రాకున్నది 'అమ్మా' అన్న తన పిలుపు

ఏ కొరనోము నోచితినో, కన్న తల్లిని కానైతి కన్నయ్యకు
ఏనాటి రుణమడ్డుపడెనో, కనుమూయనైతి తన ఎడబాటుకు

తనను పెంచినన్నాళ్ళు, నా జీవితం వరమైనది, వేదమైనది
                                                              వెలుగుకే మారుపేరైనది
తను లేని నా జీవితం శోకమైనది, పాపమైనది
                                                  చీకటికే ప్రతిరూపమైనది

పసివాడని కూడా చూడకుండా కట్టివేసిన పాప ఫలితమేమోయిది
లేకలేక కలిగిన నా మాతృత్వపు సిరి మీద
                           ఎవరిదో చెడు దృష్టి సోకిన పర్యవసానమేమో యిది

సిరిమువ్వల సందడి లేకున్నది నా ముంగిట
వరాల నా తండ్రి ఏనాడు నిలుచునో నా ఎదుట

వీడవులే తన తలపులు నన్నేనాటికి
కరిగిపోతున్నది నా ఆయువు నానాటికి

ఈ మన్ను మట్టిలో కలిసేది ఏనాటికో
నా ఊపిరి తన వేణువు చేరేది యింకెన్నాళ్ళకో...
                *        *        *

మినీ కవితలు

యమున నీటిలో మన నీడ ఎంత బాగుందో
ఆ నీడ పక్కన జంట కలువల సొగసు మరెంత బాగుందో

* * * *

వెన్నెలొచ్చి చాలాసేపయింది
గాలి కూడా చల్లగా వీస్తోంది
త్వరగా వచ్చెయ్
యిద్దరం కలసి...

వెన్నెలకు చల్లదనాన్ని యిద్దాం
చల్లని గాలికి వెచ్చదనాన్ని బహుమతి చేద్దాం

* * * *

అంతగా నవ్వొద్దు - నా దిష్టే తగలొచ్చు
వింతగా నను చూడొద్దు - నీ దిష్టే తగలొచ్చు

మరింత నన్నంటి వుండొద్దు - అందరి దిష్టి మనకు తగలొచ్చు
అంతులేనంతగా నన్ను ప్రేమించొద్దు - మన దిష్టే మన ప్రేమకు తగలొచ్చు

* * * *

నా ఊహ నీవే, ఊపిరి నీవే
హృది నీవే, వ్యథ నీవే

నాదు తొలి పొద్దు నీవే, తుది నీవే
తుదిలేని కథ నీవే...

* * * *

అర్పణ

ప్రభూ,

నీవు రాక ముందు అన్నీ సరిగ్గా చేయాలని అనుకుంటాను
నీవు వచ్చింతరువాత అన్నీ అవకతవకగా చేస్తుంటాను

నీకై పదము ముందు పాడాలో
నీ పాదాలే ముందంటాలో
తేల్చుకోలేక పదం మరచి నిలుచుంటాను

నేను నీకేమీ కానని తెలిసి
ఏమో కావాలని తలచి
తెలిసీ తెలియక తెలివి మరచి
నీ చేతుల్లో సోలిపోతాను

'వెళ్ళి రానా యిక' అని నీవు అంటే
ఏమనాలో తెలియక నేల చూపులు చూస్తుండిపోతాను
నీ చిరునవ్వు కెంపులను చూస్తూ నన్ను నేను మరచిపోతాను

నన్ను విడచి వెళ్ళవద్దని నిన్నడగలేక, ఆపలేక
నువ్వు లేక నేనుండలేనని పెదవి విప్పి చెప్పలేక
నా ఊపిరిని నీ మురళికి అరువిచ్చి
నీ పాదాల వాలిపోతాను
నీ దానిగానే రాలిపోతాను