Tuesday, March 3, 2009

పాప

అమ్మా! పాప ఏడుస్తున్నదెందుకు?
అడిగాడు చిన్న కొడుకు
తను పుట్టగానే అందరూ
అయ్యో! అమ్మాయా! అన్నందుకు
తనాడ పిల్లని అందరూ
అలుసుగా చూస్తున్నందుకు

అమ్మా! పెళ్ళనగానే చెల్లి
ఏడుస్తున్నదెందుకు?
అడిగాడీనాడు ఆ కొడుకు
పెళ్ళికొడుకు తనను కాక
తను తెచ్చే డబ్బును చూసి ఒప్పుకున్నందుకు
తను వెళ్తూ తన తండ్రికి అప్పు మిగిల్చినందుకు

ఆవిష్కరణ

తల్లి
చెల్లి
అక్క
ఆడబడుచు
అత్త
కోడలు
పిన్ని
వదిన
అపుడపుడు దేవత
ఒక్కొక్కపుడు పతిత
యుగ యుగాలుగా ఇలాగే చూడబడ్డాను
ఇలాగే ఉండేలా మలచబడ్డాను
నేను నేనుగా చూడబడలేదు
నన్ను నన్నుగా చూడటం ఎవ్వరికి చేతకాలేదు
అందరూ దృష్టి లోపం ఉన్నవాళ్ళే
నీ తలరాత ఇదీ అని శాసించిన వాళ్ళే
నా చుట్టూ గిరిగీసి నన్ను శిలను చేసిన వాళ్ళే
తామేమిటో కూడా తమకు తెలియని వాళ్ళే
నేనేమిటో ఎప్పటికీ తెలుసుకోలేని వాళ్ళే

వీరంతా...
మనసుతో ఆలోచించేదెన్నడో!
నన్ను మనిషిగా చూసేదెన్నడో!
నన్ను నన్నుగ ఆవిష్కరించేదెన్నడో!!

'వార్త' లో నా వ్యాసం

13 డిసెంబర్ 2007 న 'చెలి' లో ప్రచురితమైన వ్యాసం.




Monday, March 2, 2009

గెలుపు

ప్రభూ,

నీకిది జగన్నాటకం
నాకిది ప్రాణ సంకటం
అన్నిటికి అతీతుడవు నీవు
అన్నిటికి బద్ధురాలిని నేను

నాకంతా ద్వంద్వం
నీకంతా అనంతం
రాక పోకల నలిగేను నేను
రాక పోకలు లేక వెలిగేవు నీవు

భక్తితో బంధించ వచ్చునట నిన్ను
రక్తిలో మునిగియున్నాను నేను
నాలో వుంటూ నాకు దూరం నీవు
నీలో వుంటూ నీకు దూరం నేను

అనంతకాలం నుండి ఆడుతున్న ఆటలో
ప్రతిసారి ఓడిపోతున్నది నేనే
కాదు, ప్రతిసారి గెలుస్తున్నది నేనే

అదెలా?

నేను ఓడినా చేరేది నీ ఒడే కాబట్టి
నీ ఒడి చేరటమే నా గెలుపు కాబట్టి
నీ వెలుగులో కలవటమే నా తుది మలుపు కాబట్టి